నీళ్లు అందక పంటలు ఎండుతున్నయ్..పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

నీళ్లు అందక పంటలు ఎండుతున్నయ్..పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

మెదక్ (చేగుంట), వెలుగు: సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. నిజాంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామాయంపేట – గజ్వేల్ రహదారిపై పులిమామిడి చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

దీంతో గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వేలాది రూపాయలు ఖర్చు చేసి యాసంగి పంటలు సాగు చేశామని, కానీ నీటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు.

చేగుంట మండలం పులిమామిడి, కిష్టాపూర్ గ్రామాల రైతులు తమ పొలాలకు నీరు రాకుండా అభ్యంతరం తెలుపుతున్నారని ఆరోపించారు. సాగర్ నీరు అందకపోతే తమ పంటలు పండవని, తమకు చావే శరణ్యమంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మమత అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించి సాగునీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.